Header Ads

6000 కోట్లు ఆస్తి ఉన్నా ఈ తండ్రి తన కొడుకుకి ఓ పరీక్ష పెట్టాడు. అన్ని వదిలేసి ఎక్కడైనా వెళ్లి ఒక నెల రోజులు బ్రతికి చూపించు

గుజరాత్‌ లోని సూరత్‌కి చెందిన సావ్‌జీ పెద్ద వజ్రాల వ్యాపారి. హరే కృష్ణ డైమండ్ ఎక్స్‌ పోర్ట్స్ యజమాని. ఆయన కంపెనీ 71 దేశాల్లో వ్యాపారం చేస్తుంది. దాదాపు 6 వేల కోట్ల రూపాయల ఆస్తులున్న కంపెనీ అది. ఏడాది టర్నోవర్ వెయ్యి కోట్ల రూపాయల పైనే. అటువంటి వ్యాపారి కొడుకు ఎలా ఉంటాడు? సావ్‌జీ కొడుకు 21 ఏళ్ల ‘ద్రవ్య’ అమెరికాలో ఎంబిఎ చదువుతున్నాడు. వేల కోట్ల ఆస్తి. అమెరికాలో చదువు. వయసులో ఉన్న కుర్రాడు. ఎలా ఉంటాడు చెప్పండి?

ఆ ద్రవ్య మొన్న సెలవులకు ఇండియా వచ్చాడు. అమెరికా నుంచి వచ్చిన తన కొడుకుని పిలిచి విషయం చెప్పాడు తండ్రి. కేవలం 3 జతల బట్టలు, చాలా ఎమెర్జెన్సీ అయితే తప్ప వాడవద్దని చెప్పి ఓ 7 వేల రూపాయలు ఇచ్చాడు. సెల్‌ఫోన్ కూడా లేదు. తనకు భాష రాని, తనెవరో తెలియని కేరళలోని కొచ్చి నగరానికి పంపాడు. అక్కడ నెల రోజుల పాటూ బతకాలి. తన ఖర్చులన్నీ తానే సంపాయించుకోవాలి. తిండి, ఉండటానికి చోటు, అన్నీ.. తానే సంపాయించాలి. ఎంతో ఎమెర్జెన్సీ అయితే తప్ప తండ్రి ఇచ్చిన 7 వేలు వాడకూడదని షరతు. కొడుకు ఒప్పుకున్నాడు.
సావ్‌జీ తన కొడుకు ద్రవ్యకి పెట్టిన షరతులివే..

తను సొంతంగా పని చేసుకుని డబ్బు సంపాదించాలి.
ఎక్కడా వారం కంటే ఎక్కువగా పనిచేయకూడదు.
తండ్రి పేరు కానీ, తండ్రి ఇచ్చిన 7 వేలు కానీ, మొబైల్ ఫోన్ కానీ వాడకూడదు.

తండ్రి మాట ప్రకారం మొన్న జూన్ 21న కొచ్చిలో అడుగుపెట్టాడు ద్రవ్య. మొదటి 5 రోజులూ ద్రవ్యకి ఎక్కడా పని దొరకలేదు. చాలా ఫ్రస్టేట్ అయ్యాడు. మొత్తం 60 చోట్ల ఉద్యోగానికి వెళితే ఎవరూ పని ఇవ్వలేదు. తిరస్కరణకు ఉండే విలువ, పనికి ఉండే విలువ అప్పుడే తెలిసింది అంటాడు ద్రవ్య. బహుశా అతను జీవితంలో ఊహించి ఉండడు.. వేలకోట్ల అధిపతి కాస్తా, రోడ్డుపై ఉద్యోగానికి తిరిగితే 60 మంది అవతలికి పొమ్మంటారని..

తిరగ్గా తిరగ్గా చేరనెల్లూరులోని ఓ బేకరీలో ద్రవ్యకి మొదటి ఉద్యోగం వచ్చింది. తరువాత ఓ కాల్ సెంటర్‌లో పనిచేశాడు. తరువాత ఓ చెప్పుల షాపులో పనిచేశాడు. మెక్ డొనాల్డ్ ఔట్లెట్‌లో కూడా పని చేశాడు. తనకు ఉద్యోగం ఇచ్చిన వాళ్లకు గుజరాత్ కి చెందిన పేద రైతు కుటుంబం నుంచి వచ్చాననీ, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నానీ చెప్పాడు.

మొత్తంగా మనోడు నెల రోజులు కష్టపడి, తన ఖర్చులు పోనూ 4 వేల రూపాయలు సంపాదించాడు. “నేనెప్పుడూ డబ్బుల గురించి ఆలోచించలేదు కానీ, భోజనానికి, ఉండటానికి సరిపడా సంపాయించాలని కష్టపడ్డాను. 40 రూపాయలకు భోజనం చేసేవాణ్ణి. రోజుకు 250 రూపాయల రోజుకి లాడ్జి ఖర్చు అయింది నాకు.” అన్నాడు ద్రవ్య.

30 రోజులు గడిచాయి. మొన్న మంగళవారం జూలై 20న తిరిగి సొంతూరు సూరత్‌లో అడుగుపెట్టాడు ద్రవ్య. నెల రోజుల్లో జీవితానికి సరిపడా పాఠాలు నేర్చుకున్నాడు. డబ్బుల విలువ, పేదల శ్రమ విలువ తెలుసుకున్నాడు. ఆయన తండ్రి కోరుకున్నది కూడా అదే.

“జీవితాన్ని అర్థం చేసుకోవాలనీ, పేదలు డబ్బు కోసం, ఉద్యోగాల కోసం ఎలా కష్టపడతారో మా అబ్బాయి తెలుసుకోవాలని కోరుకున్నాను. ఏ యూనివర్సిటీలో ఇలాంటివి చెప్పరు. అందుకే మావాడికి ఈ పరీక్ష పెట్టాను అన్నారు ఆ తండ్రి.”