ఎలుకను పట్టుకుంటే 20,000 బహుమతి!
ఇళ్ళలోకి పాము వస్తే ఎంతటివారైనా భయబ్రాంతులకు గురవుతారు. ఒకవేళ ఊర్లో అయితే.. ఆ ఊర్లో పాములు పట్టేవాడిని పిలిచి ఇంట్లో దూరిన పాముని పట్టుకొమ్మని వేడుకుంటారు. అదే పట్నంలో అయితే.. స్నేక్ క్యాచర్స్ లేదా బ్లూ క్రాస్ కి కాల్ చేసి రమ్మంటారు. వాళ్ళు పాములను పట్టుకొనివెళ్లి.. అడవిలో వదిలేస్తారు. ఇలా చేసినందుకు వారికి రూ.100 నుండి 500 వరకు చెల్లించాల్సిందే.
కానీ మన ఇంట్లో ఎలుక తిరుగుతుంటే మామూలుగా అయితే పట్టించుకోము. కానీ అది ఇంట్లో వస్తువులని నాశనం పట్టిస్తున్దంటే దాని అంతు చూడనిదే వదిలిపెట్టం. అలాగని ఎలుకని పట్టుకోడానికి ఎప్పుడైనా.. ఎవరికైనా.. డబ్బు ఇచ్చారా? లేదు కదా?... కాని ఎలుకలను పట్టుకుంటే బహుమతులు ఇస్తామని సాక్షాత్తు సర్కారే ప్రకటించిన వైనం ఇండోనేషియా దేశంలో చోటుచేసుకుంది. ఇండోనేషియా దేశ రాజధాని జకార్తా నగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న ఎలుకల నుండి విముక్తి పొందేందుకు అక్కడి ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రకటించింది. నగరంలో విచ్చలవిడిగా తరుగుతున్న ఎలుకలను పట్టుకుంటే బహుమతులు ఇస్తామని జకార్తా డిప్యూటీ గవర్నరు జారోత్ సైఫుల్ హిదాయత్ ప్రకటించారు. ఒక ఎలుకను పట్టుకుంటే ఇండోనేషియా కరెన్సీలో 20,000 రుపియాలను బహుమతిగా ఇస్తామని హిదాయత్ తెలిపారు. అంటే మన దేశ కరెన్సీలో 102 రూపాయలన్నమాట. కాని వాటిని పట్టుకునేటప్పుడు తుపాకిలు ఉపయోగించరాదని స్పష్టం చేశారు. ఎందుకంటే తుపాకి గురి తప్పితే బులెట్ ప్రజలకు తగిలే అవకాశముంది కనుక ఈ ఒక్క షరతు పెట్టారు. ప్రజలు చేయవలసిందల్లా... ఎలుకలను పట్టుకొని స్థానిక అధికారులకు అప్పగిస్తే.. తగిన డబ్బు ఇచ్చి.. అనంతరం ఆ ఎలుకలను పూడ్చేందుకు పారిశుధ్ధ్య ఏజెన్సీకి అందజేస్తామని డిప్యూటీ గవర్నరు వివరించారు.
